TG EAPCET 2025 Registrations: ఎట్టకేలకు ప్రారంభమైన ఈఏపీసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. పరీక్ష తేదీలివే

నాన్‌ లోకల్‌ కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఈఏపీసెట్‌ 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ కన్వినర్‌ కోటాలో నాన్‌ లోకల్‌ సీట్లపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలో జాప్యం నెలకొంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే..

TG EAPCET 2025 Registrations: ఎట్టకేలకు ప్రారంభమైన ఈఏపీసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. పరీక్ష తేదీలివే
TG EAPCET 2025

Updated on: Mar 02, 2025 | 6:24 AM

హైదరాబాద్‌, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ కన్వినర్‌ కోటాలో నాన్‌ లోకల్‌ సీట్లపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలో జాప్యం నెలకొనడంతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానికతతోపాటు 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాపై స్పష్టత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో అడ్డంకి తొలగిపోయినట్లైంది. దీంతో ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన తర్వాత న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన పలు చర్యలు తీసుకున్నారు.

తాజా ఉత్తర్వులతో మార్చి 1 నుంచి ఉదయం 10.30 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీలోని విజయవాడ, కర్నూలు పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాలో ప్రవేశాలు పొందేందుకు ఏపీ విద్యార్థులకు అర్హత లేనందున ఈసారి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూ.2,500, రూ.5 వేల ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి హైదరాబాద్‌లోని జోన్‌ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులకు తప్పనిసరిగా 2025 డిసెంబరు 31 నాటికి 16 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌ కోర్సులకు 2025 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో చేరాలంటే ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీవిభాగం పరీక్ష తప్పనిసరిగా రాయాలంటూ ప్రభుత్వం పేర్కొంది. బీఫార్మసీ, ఫార్మా-డితోపాటు బీటెక్‌ బయోమెడికల్, ఫార్మాసూటికల్‌ ఇంజినీరింగ్‌సీట్లను ఎంపీసీ, బైపీసీ గ్రూపు విద్యార్థులకు చెరి సగం కేటాయిస్తారు. బయోమెడికల్, ఫార్మాసూటికల్‌ కోర్సులు గతేడాది కూడా ఉన్నా వీటిలో సగం సీట్లు ఎంపీసీ విద్యార్థులకు ఇస్తారని ఈసారి నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.