JEE 2025 Topper Success Story: ఆనందమే నా విజయ రహస్యం.. జేఈఈ టాపర్‌ రజిత్‌ సక్సెస్‌ జర్నీ ఇదే!

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో వంద శాతం స్కోర్‌ చేసి టాపర్‌గా నిలిచిన రజిత్‌ సక్సెస్‌ మంత్ర.. ఆనందం అని చెబుతున్నాడు. ముక్కుమూసుకుని ముని మాదిరి ప్రిపరేషన్ సాగించడానికి బదులు తనకు ఇష్టం వచ్చిన సమయంలో మాత్రమే చదివేందుకు ఆసక్తి చూపి ఉత్తమ స్కోర్‌ సాధించినట్లు చెబుతున్నాడు. పైగా ఎలాంటి ప్రిపరేషన్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేసుకోలేదట..

JEE 2025 Topper Success Story: ఆనందమే నా విజయ రహస్యం.. జేఈఈ టాపర్‌ రజిత్‌ సక్సెస్‌ జర్నీ ఇదే!
JEE 2025 Topper

Updated on: Feb 13, 2025 | 4:19 PM

జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వీటిల్లో 14 మంది అభ్యర్ధులకు 100 పర్సంటైల్ వచ్చింది. వీరిలో కోటలోని కెరీర్ సిటీకి చెందిన రజిత్ గుప్తా కూడా ఉన్నాడు. JEE మెయిన్ 2025 జనవరి సెషన్‌లో 100 పర్సంటైల్ సాధించి టాపర్‌గా నిలిచాడు. జేఈఈలో టాప్‌ స్కోర్‌ చేసిన రంజిత్‌ తన విజయ రహస్యం గురించి మాట్లాడుతూ.. ఆనందమే నా విజయానికి కీలకం. నేను ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటానని అంటున్నాడు. కఠినమైన టైం టేబుల్‌ అనుసరించే చాలా మంది టాపర్‌ల మాదిరిగా కాకుండా, రజిత్ మాత్రం చాలా రిలాక్స్‌డ్‌ విధానాన్ని అనుసరించానని చెబుతున్నాడు. ప్రిపరేషన్‌ కోసం రజిత్‌ అసలు షెడ్యూల్‌ను పాటించలేదట. ఇది అనవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుందని, అందుకే తనకు నచ్చినప్పుడు మాత్రమే చదువుకునేవాడినని చెబుతున్నాడు. కొంత సమయం చదివినా, బాగా చదువుకునేవాడినని జేఈఈ టాపర్ రజిత్‌ తెలిపాడు.

అలాగే రజిత్ విజయానికి మరో రహస్యం ఏమిటంటే తప్పులను గుర్తించి వాటిపై పనిచేయడం. చేసిన తప్పులను పునరావృతం చేయకూడదనేది నా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే తప్పులను తొలగించినప్పుడే పునాది బలంగా మారుతుంది. ఈ వ్యూహం కాలక్రమేణా నా భావనలను మెరుగుపరచుకోవడానికి సహాయపడింది. కేవలం కంఠస్థం చేయడానికి బదులుగా, ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడం వైపు నా జర్నీ సాగిందని తెలిపాడు. అందుకే JEE మెయిన్ 2025 పరీక్ష తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నాడంటే.. కనీసం అతడు ఆన్సర్ కీని కూడా చెక్ చేయలేదట. మా నాన్నగారు ఓసారి ఆన్సర్ కీని చెక్ చేయమని చెప్పారు. కానీ నేను.. నాన్న వర్రీ అవ్వొద్దు.. నేను అడ్వాన్స్‌డ్‌కి అర్హత సాధిస్తాను’ అని కాన్ఫిడెన్స్‌గా చెప్పానని రజిత్‌ తెలిపాడు. అనుకున్నట్లుగానే ఫలితాల్లో వంద శాతం పర్సంటైల్‌ సాధించి టాపర్‌గా నిలిచాడు.

రజిత్ ప్రతిభ JEEలో మాత్రమే కాదు.. 10వ తరగతి CBSE బోర్డు పరీక్షలలో కూడా 97% స్కోర్ చేశాడు. అనేక సైన్స్ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధించాడు. 11వ తరగతిలో మలేషియాలో జరిగిన ఆసియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్ (APhO) 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. జూనియర్ సైన్స్, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రాలలో HBCSE ముంబైలో OCSC (ఓరియంటేషన్-కమ్-సెలక్షన్ క్యాంప్) కు మూడుసార్లు ఎంపికయ్యాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న రజిత్‌ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించడమే తన విజయాలకు కారణం అంటున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా తమ కాలనీ పిల్లలతో ఆడుకుంటానని, అలాగే చాలా మంది JEE అభ్యర్థుల మాదిరి స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండటానికి బదులు.. తన ఫోన్‌ను నిరంతరం వాడుతూ ఉంటానని చెప్పాడు. అందులో వాట్సాప్‌ను కేవలం చదువుకు మాత్రమే వాడేవాడట. రజిత్ సక్సెస్‌ జర్నీలో అతడి కుటుంబం మద్దతు కూడా కీలకమే. అతని తండ్రి దీపక్ గుప్తా బీఎస్ఎన్ఎల్‌లో సబ్-డివిజనల్ ఇంజనీర్‌గా, తల్లి డాక్టర్ శ్రుతి అగర్వాల్ జెడిబి కాలేజీలో హోమ్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జేఈఈ అభ్యర్థులకు రజిత్‌ సలహా ఏంటంటే.. కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కు NCERT తప్పనిసరి. JEE మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించడంలో ఈ సబ్జెక్ట్‌ కీలకంగా మారినట్లు తెలిపాడు. తదుపరి పెద్ద సవాల్JEE అడ్వాన్స్‌డ్ 2025పై ప్రస్తుతం తన తన ఫోకస్‌ ఉన్నట్లు రజిత్‌ తెలిపాడు. మొత్తం రజిత్‌ సక్సెస్‌ జర్నీ చూస్తే.. విజయం అంటే ఎల్లప్పుడూ వినోదం, సోషల్ ఇంటరాక్షన్‌ లేకుండా ఎక్కువసేపు చదువుకోవడం మాత్రమే కాదు. తెలివిగా చదువుకోవడం, సంతోషంగా ఉండటం, తనపై తనకు నమ్మకం ఉంచడం అనే విషయాలు తెలుస్తున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.