JEE Main 2026 Paper Analysis: అత్యంత సులువుగా జనవరి 28 JEE Main రెండో షిఫ్ట్‌ పరీక్ష.. 300కి 300 మార్కులు పక్కా!

జేఈఈ మెయిన్-2026 జనవరి సెషన్ పరీక్షలు వరుసగా 4 రోజులు జరిగగా.. అన్ని సెషన్లు ప్రశ్నాపత్రం విద్యార్ధులకు చుక్కలు చూపించాయి. అత్యంత కఠినమైన ప్రశ్నలతో దిక్కుతోచని విధంగా గందరగోళం పెట్టాయి. అయితే 5వ రోజు బుధవారం (జనవరి 28) రెండో షిఫ్ట్‌లో జరిగిన పరీక్ష మాత్రం..

JEE Main 2026 Paper Analysis: అత్యంత సులువుగా జనవరి 28 JEE Main రెండో షిఫ్ట్‌ పరీక్ష.. 300కి 300 మార్కులు పక్కా!
JEE Main 2026 Day 5 Shift 2 Paper Analysis

Updated on: Jan 29, 2026 | 1:14 PM

హైదరాబాద్‌, జనవరి 29: జేఈఈ మెయిన్-2026 జనవరి సెషన్ పరీక్షలు జనవరి 21వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుసగా 4 రోజులు జరిగిన పరీక్షల్లో అన్ని సెషన్లు ప్రశ్నాపత్రం విద్యార్ధులకు చుక్కలు చూపించాయి. అత్యంత కఠినమైన ప్రశ్నలతో దిక్కుతోచని విధంగా గందరగోళం పెట్టాయి. అయితే 5వ రోజు బుధవారం (జనవరి 28) రెండో షిఫ్ట్‌లో జరిగిన పరీక్ష మాత్రం ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలతో పోలిస్తే ఎంతో సులువుగా వచ్చింది. ఈ షిఫ్ట్‌లో పేపర్ అత్యంత సులభంగా ఉండటమే అందుకు కారణం. బుధవారం రెండో సెషన్‌లో జరిగిన పరీక్షల్లో మ్యాథమెటిక్స్ మధ్యస్థంగా వచ్చింది. సరైన సన్నద్ధత కలిగిన విద్యార్థులు సులభంగానే అన్ని ప్రశ్నలు పరిష్కరించేలా ఉంది. ఇక కెమిస్ట్రీ ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్థ స్థాయిలో వచ్చాయి.

కొన్ని ప్రశ్నలు స్టేట్‌మెంట్ ఆధారితంగా వచ్చాయి. ప్రశ్నను కాస్త నిశితంగా చదివితే గుర్తించడం కష్టమేమీ కాదు. మరోవైపు మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్ విభాగంలో ప్రశ్నలు చాలా సులభంగా రావడం మరో విశేషం. ఈ విభాగంలో ప్రశ్నలు నేరుగా Fundamental concepts, ప్రైమరీ అప్లికేషన్లపైనే వచ్చాయి. దీంతో ఈ సెషన్‌లో పరీక్ష రాసిన విద్యార్ధులు ఎగిరిగంతేశారు. దీంతో ఈ సెషన్‌లో పరీక్ష రాసిన విద్యార్ధులు మిగతా సెషన్‌లలో పరీక్షలు రాసిన విద్యార్ధుల కంటే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు అత్యంత సులువుగా 300కి 300 స్కోర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సగటు విద్యార్థులకు కూడా 100 నుంచి 110 సులువుగా స్కోర్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ 2026 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. అయితే ఈ సారి ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్న పరీక్షల తీరు మొదటి రోజు నుంచే ఆందోళన కలిగిస్తున్నాయి. TCS మోడల్‌లో కాకుండా Eduquity మోడల్‌లో ప్రశ్నలు వచ్చాయని విద్యార్ధులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే జనవరి 28 మధ్యాహ్నం సెషన్‌లో వచ్చిన క్వశ్చన్‌ పేపర్‌ ఊహకు అందని విధంగా అత్యంత సులువుగా వచ్చింది. దీంతో ఈ సెషన్‌లో పరీక్ష రాసిన విద్యార్ధులు తెగ సంబరపడి పోతున్నారు. నిజానికి ఆన్‌లైన్‌ పరీక్షలు నార్మలైజేషన్‌కు లోబడి ఉంటాయి. ఇది జరగాలంటే ఒక్కో సెషన్‌లో వచ్చే క్వశ్చన్‌ పేపర్‌ కాఠిన్యం, మధ్యస్థం, సులువు.. అనే ఈక్వేషన్‌కు లోబడి ఉంటాయి. కానీ కాఠిన్యం, మధ్యస్థం సెషన్లలో కంటే సులువుగా వచ్చే సెషన్‌లో విద్యార్ధులు అత్యధిక స్కోర్ చేస్తారు. మిగతా సెషన్లలోని విద్యార్ధులు మాత్రం తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలా జరగకూడదంటే విద్యార్దులందరికీ దేశ వ్యాప్తంగా ఒకే సెషన్‌లో ఒకే క్వశ్చన్‌ పేపర్‌తో ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే సమన్యాయం జరగుతుంది. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే విమర్శలు వచ్చినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.