JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు

జేఈఈ మెయిన్‌ 2025 మలి విడత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు రేపట్నుంచి (జనవరి 31) ప్రారంభం కానున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇక ఇప్పటికే తొలి విడత పేపర్ 1 పరీక్షలు పూర్తి కాగా జనవరి 30వ తేదీతో పేపర్ 2 పరీక్ష కూడా పూర్తవుతుంది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలు ఏప్రిల్ తొలి వారంలో జరగనున్నట్లు ఎన్టీయే వెల్లడించింది..

JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు
JEE Main 2025 Session 2

Updated on: Jan 30, 2025 | 6:22 AM

హైదరాబాద్‌, జనవరి 30: జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. జనవరి 22వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్‌ 1 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక చివరి పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌ 2 జరీక్ష జరుగుతుంది. వీటికి సంబంధించి రెస్పాన్స్‌ షీట్, ‘కీ’లను ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్‌టీఏ విడుదల చేయనుంది. ఈ పరీక్షలు ముగిశాక జేఈఈ మెయిన్‌ 2025 మలి విడత పరీక్షలకు జనవరి 31 (శుక్రవారం) నుంచి అంటే రేపట్నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది.

బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ మొదటి షిఫ్ట్‌ పరీక్ష కాస్త సులువుగా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఫిజిక్స్‌లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఎక్కువగా వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సబ్జెక్ట్‌లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ నుంచే వచ్చాయి. ఇక మ్యాథమెటిక్స్‌ కాస్త క్లిష్టతతో ఉందని, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని విద్యార్ధులు చెబుతున్నారు. ఇక రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌ క్లిష్టంగా న్యుమరికల్‌ ఆధారిత ప్రశ్నలు వచ్చాయని, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో డైరెక్ట్‌ ప్రశ్నలు అడిగినట్లు విద్యార్థులు చెప్పారు. మొత్తం పది షిఫ్ట్‌లలో 25, 29 తేదీల్లో షిఫ్ట్‌ 1 పేపర్లు, 28వ తేదీ షిఫ్ట్‌ 2 పేపర్లు కఠినంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
కాగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో, జేఈఈ అడ్వాన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 23 ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.