జేఈఈ మెయిన్ (జనవరి) 2023 తొలి విడత పేపర్-1 ఫలితాలను ఎన్‌టీఏ మంగళవారం (ఫిబ్రవరి 8) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్ సాధించిన 20 మంది విద్యార్ధుల్లో నలుగురు తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా దండుమైలారంకు చెందిన గుత్తికొండ అభిరామ్, తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన బిక్కిన అభినవ్ చౌదరి, వైఎస్సార్ జిల్లాకు చెందిన దుగ్గినేని వెంకట యుగేష్.. ఈ నలుగురు విద్యార్ధులు వందకు వంద శాతం స్కోర్ సాధించారు. కటాఫ్ మార్కులు/పర్సంటైల్ ఎంతనేది ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు.
కాగా జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 8.24 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది పరీక్ష రాశారు. వీటికి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇక జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు కూడా రెండో విడతకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయిస్తారు. అర్హత సాధించిన మొదటి 2.50 లక్షల మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత సాధిస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.