JEE Advanced 2025 Exam Date: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

|

Dec 03, 2024 | 6:42 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఐఐటీ కాన్ పూర్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితోపాటు పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత ప్రమాణాలను కూడా విడుదల చేసింది..

JEE Advanced 2025 Exam Date: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
JEE Advanced 2025 Exam Date
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు తాజా షెడ్యూల్‌ ప్రకారం 2025 మే 18వ తేదీన రెండు సెషన్లలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 18న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. అడ్వాన్స్‌ పరీక్ష 2 పేపర్లకు ఉంటుంది. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండేండ్లలో 2 సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల అర్హత విషయానికొస్తే.. ఈ పరీక్ష రాసే అభ్యర్ధులు తప్పనిసరిగా 2000 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అయితే ఐదేళ్ల వరకూ సడలింపు ఉంటుంది. అంటే వీరంతా1995 అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఏడాదికి రెండు సార్లు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో అన్ని క్యాటగిరీల విద్యార్థుల్లో తొలి 2.50 లక్షల ర్యాంకర్లను మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అనుమతిస్తారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమెస్టీ, మ్యాథమేటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఫస్ట్‌ అటెంమ్ట్‌లోనే పాస్ అయి ఉండాలి.

జేఈఈ అడ్వాన్డ్స్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కాస్త భారీగానే ఉంటుంది. జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు క్యాటగిరీల వారీగా వేర్వేరుగా ఉంటుంది. అన్ని క్యాటగిరీల్లో బాలికలతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1450, ఇతర అభ్యర్థులు రూ.2900 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. సార్క్ దేశాల్లో పీఐఓ, ఓసీఐలతోపాటు విదేశీ విద్యార్థులు 90 డాలర్లు, సార్క్‌యేతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థులు 180 డాలర్లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.