
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. టైం టేబుల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు పరీక్షలు జరగనుండగా.. సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు ముగిసిన వెంటనే వేసవి సెలవులు ఇవ్వబోమని ఇంటర్ బోర్డు వెల్లడించింది. సెకండ్ ఇయర్‌లోకి అడుగు పెట్టే ఇంటర్ విద్యార్ధులకు సీబీఎస్‌ఈ తరహాలో 2 వారాలపాటు ఇంటర్ సెకండ్ ఇయర్ పాఠాలు బోధించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
సాధారణంగా సీబీఎస్‌ఈ బోర్డు స్కూళ్లలో 11వ తరగతి పరీక్షలయ్యాక నెల రోజులు 12వ తరగతి పాఠాలను బోధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈసారి ఆ విధానం అమలు చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 17వ తేదీకి ముగియ నున్నాయి. రాష్ట్ర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలు మార్చి 31 వరకు పని చేస్తాయి. ఆ తర్వాత వేసవి సెలవులు వస్తాయి. అంటే దాదాపు రెండున్నర నెలల పాటు సెలవులు రానున్నాయి. దీంతో చివరి పని దినం వరకైనా అంటే మార్చి 31వ తేదీ వరకైనా సెకండ్ ఇయర్ పాఠాలను బోధించాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త విధానం ప్రకారం విద్యార్ధులకు సెకండ్ ఇయర్ సిలబస్ బోధించనుంది.
ఇక స్కూళ్ల సంగతికి వస్తే మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు మొదలవుతాయి. ఈ ఏడాది స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. జూన్ 11 వరకు అంటే మొత్తం 49 రోజులు వేసవి సెలవులు రానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.