AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ మహిళల ఉపాధి గణాంకాల అసలు నిజం ఏంటి? అంకెలు చెబుతున్న అసలు కథ..

భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరుగుతున్నప్పటికీ, ఆ గణాంకాల వెనుక వేతనం లేని శ్రమ ఎంత ఉందనే ప్రశ్న కీలకంగా మారింది. PLFS 2017-18లో 23.3 శాతంగా ఉన్న మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2023-24లో 41.7 శాతానికి పెరిగినట్లు వివరిస్తున్నారు. అయితే కుటుంబ వ్యాపారాలు, వ్యవసాయ పనుల్లో వేతనం లేకుండా పనిచేసే మహిళలతో పాటు ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలు కూడా వారి శ్రమలో ప్రధాన భాగంగా ఉన్నాయి.

భారతీయ మహిళల ఉపాధి గణాంకాల అసలు నిజం ఏంటి? అంకెలు చెబుతున్న అసలు కథ..
Womens Employment Statistics
Santosh Nair
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 12:02 PM

Share

ఒక మహిళ.. తన భర్త నడిపే కుటుంబ అల్పాహార దుకాణంలో ఉదయం నుంచి పనిచేస్తుంది. మసాలాలు దంచడం, నోట్‌బుక్‌లో లెక్కలు రాయడం, భర్త కొద్దిసేపు పక్కకు వెళ్లినప్పుడు కస్టమర్లకు సేవలు అందించడం వంటి పనులన్నీ తనే చూసుకుంటుంది. మరి ఆమె ఉద్యోగం చేస్తోందా అని అడిగితే.. “తానేం పనిచేయడం లేదు, భర్తకు కాస్త సాయం చేస్తున్నానంతే” అని సమాధానం ఇస్తుంది.

కానీ, ప్రభుత్వ ఉపాధి సర్వేలను గమనిస్తే మాత్రం గత కొన్నేళ్లుగా ఈ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. అసలు భారతీయ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం (FLFP) గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలు, నివేదికల ప్రకారం.. అసలు విషయాలను తెలుసుకుందాం..

అంకెల్లో పెరుగుదల.. వాస్తవంలో వేరే చిత్రం:

రికార్డు స్థాయిలో పెరిగిన భాగస్వామ్యం: పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం.. భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18లో కేవలం 23.3 శాతంగా ఉండగా, 2023-24 నాటికి అది ఏకంగా 41.7 శాతానికి (దాదాపు రెట్టింపు) పెరిగింది. ఈ గణాంకాలను పైపైన చూస్తే భారతీయ మహిళలు ఉపాధి రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నట్లు అనిపిస్తుంది.

లోతుగా పరిశీలిస్తే కనిపిస్తున్న నిజం: ఈ పెరుగుదల కొత్తగా లభించిన జీతాల ఉద్యోగాల వల్ల రాలేదు. స్వయం ఉపాధి (Self-employment) విభాగం ద్వారా, ముఖ్యంగా ‘కుటుంబ వ్యాపారంలో వేతనం లేని సహాయకులు’ (Unpaid helpers in household enterprises) కేటగిరీ కింద పనిచేస్తున్న మహిళల సంఖ్య పెరగడం వల్లే ఈ గణాంకాలు పైకి కనిపించాయి.

గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవాలు: గ్రామీణ భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం మహిళల్లో 42.3 శాతం మంది ఎలాంటి ప్రత్యక్ష వేతనం (Direct wage) తీసుకోకుండా, కుటుంబ వ్యాపారాలు లేదా పొలాల్లో రోజూ ఎన్నో గంటలు శ్రమిస్తున్నవారే కావడం గమనార్హం.

ఇంటి పనులే భారమైన బాధ్యతలు (Time Use Survey):

భారత ప్రభుత్వ ‘టైమ్ యూజ్ సర్వే’ (Time Use Survey) వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని మరింత స్పష్టం చేస్తున్నాయి:

ఉచిత గృహ కార్మికులుగా మహిళలు: మహిళలు రోజుకు సగటున 305 నిమిషాలు (సుమారు 5 గంటలు) కేవలం జీతం లేని ఇంటి పనులు, వంట, కుటుంబ సభ్యుల సంరక్షణ (Caregiving) కోసమే వెచ్చిస్తున్నారు.

పురుషుల భాగస్వామ్యం తక్కువ: అదే పనుల కోసం పురుషులు కేవలం 163 నిమిషాలు (సగం కంటే తక్కువ) మాత్రమే కేటాయిస్తున్నారు.

ఇదే సర్వేలో ప్రతిరోజూ వేతనం వచ్చే పనిలో పాల్గొంటున్నట్లు చెప్పిన మహిళలు కేవలం 25 శాతం మంది మాత్రమే ఉండగా, పురుషులు 75 శాతం మంది ఉన్నారు.

అసలు ప్రశ్న ఏమిటి?

ఈ గణాంకాలన్నింటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన విషయం బోధపడుతుంది. భారతీయ మహిళలు ఎప్పుడూ పని చేయకుండా ఖాళీగా లేరు. రోజూ గంటల తరబడి ఎంతో కష్టపడుతూనే ఉన్నారు. అసలు ప్రశ్న.. ఆ పనికి తగిన ప్రతిఫలం దక్కుతోందా? అది వేతనంతో కూడుకున్నదా? కుటుంబం, సమాజం – అధికారిక గణాంకాలు దాన్ని ‘ఉద్యోగంగా’ గుర్తిస్తున్నాయా? అనేదే అసలైన సమస్య.

కుటుంబ దుకాణాల్లో శ్రమ: భర్త దుకాణంలో ఖాతాలు చూసుకునే మహిళ ఎంతో నైపుణ్యంతో కూడిన బాధ్యతను నిర్వహిస్తోంది. కానీ ఆమెకు ప్రత్యేకంగా వేతనం అందదు కాబట్టి ఆమెను ‘పనిచేయని మహిళ’గానే గుర్తిస్తున్నారు.

సామాజిక – భద్రతా కఠిన ఆంక్షలు: అనేక మంది మహిళలు తమకు నచ్చిన ఉపాధిని ఎంచుకోలేకపోవడానికి భద్రతా సమస్యలు, ఇంటి పనుల బాధ్యతలు, చుట్టుపక్కల తగిన ఉద్యోగావకాశాలు లేకపోవడమే కారణమవుతున్నాయి.

మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగిందనే శుభవార్తను అభినందించే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఆ సంఖ్యలు పెరగడం వెనుక కేవలం వారు ఏళ్ల తరబడి చేస్తున్న ఉచిత శ్రమ అధికారిక లెక్కల్లోకి రావడం మాత్రమే కారణమైతే, అది పెద్ద విజయంగా భావించలేము.

వచ్చేసారి ఈ గణాంకాల గురించి చర్చ వచ్చినప్పుడు.. “ఇలా పని చేస్తున్నట్లు లెక్కగట్టిన మహిళల్లో ఎంతమందికి సొంత పేరు మీద, వారి చేతికి నేరుగా వేతనం అందుతోంది?” అని ప్రశ్నించుకోవడమే నిజమైన చైతన్యానికి నిదర్శనం..

మహిళల ఉపాధిని అంచనా వేసేటప్పుడు భాగస్వామ్య రేటుతో పాటు, ఎంతమందికి నేరుగా వేతనం అందుతోంది, ఉద్యోగ భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా ఉన్నాయన్న అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Follow Us