Hyderabad: జేఎన్‌టీయూ, నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను తెలంగాణా రాష్ట్ర గవర్నర్ డా.తమిళ సై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆజాదికా అమృత్ మహోత్సవ్ సంబరాలు, జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో భాగంగా నిపుణ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించటం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం యువత తాము చేస్తున్న ఉద్యోగానికి కట్టుబడి ఉండటమే కాకుండా, తమ కుటుంబానికి, దేశానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్నారని తెలిపారు. ఉద్యోగంలో చేరుతున్న వారు, తమ శిక్షణ అప్పటికే నిలిపివేయకుండా నైపుణ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలనీ అప్పుడే జీవితంలో ముందుకు సాగుతారని సూచించారు. ఓ కంపనీకి ఓ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చినప్పుడు వారికి ఓ ఉద్యోగి మాత్రమే అయి ఉంటాడని, కానీ ఓ కుటుంబానికి జీవనోపాధి కల్పించిన వారవుతారని, కంపనీలు తాము అభివృద్ధి చెందుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. జాబ్ మేళాలో ఉద్యోగం లభించని వారు నిరుత్సాహ పడకూడదని, తమ నైపుణ్యతను పెంచుకొని ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.
దేశం మొత్తంలో 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో లోకేశ్వర ఆరాధనా అనే కార్యక్రమం చేపట్టామని నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సిఈఓ సుభద్ర రాణి అన్నారు. యువతకు ఉద్యోగం కల్పించటమే కాకుండా ఉద్యోగం రాని వారికి ఉద్యోగం పొందేలా శిక్షణ ఇవ్వాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. యువత ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని అన్నారు.
సేవా ఇంటర్నేషనల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జాబ్ మెళాకు హాజరైన వారి సంఖ్యను చూస్తే తాము చెయ్యాల్సింది చాలా ఉందని అర్థమవుతుందని, యువతకు నైపుణ్యతను పెంపొందించేందుకు తమ సంస్థ ముందు ఉంటుందని అన్నారు. సేవా ఇంటర్నేషనల్-యుఎస్ఎ వైస్ ప్రెసిడెంట్ శ్యాం కోసిగి మాట్లాడుతూ.. జాబ్ మేళాకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఇప్పటి వరకు 62,000 మంది అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగం పొందిన వారు, ఉద్యోగం పొందిన తరువాత తమ తీరిక సమయాన్ని సేవ కోసం కేటాయించాలని కోరారు.
ఈ మెగా జాబ్ మేళా నేడు, రేపు నిర్వహించనున్నారు. 140 కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్‌మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చైయనున్నారు. టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ సహా ఏదైనా డిగ్రీ, పీజీ అర్హతతో ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Also read:
Delhi Schools: పాఠశాలలపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం