CAT 2021 Exam: నవంబర్ 28న జరగనున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2021కి సంబంధించిన మార్గదర్శకాలను IIMలు విడుదల చేశాయి. వివరాలను IIMల అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఏ సమయంలో పరీక్ష హాలుకు చేరుకోవాలి, భౌతిక దూరం పాటించడం వంటి అన్ని నియమాల గురించి ప్రస్తావించారు.
మార్గదర్శకాల ప్రకారం.. సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 15 నిమిషాల ముందుగానే గేట్ మూసివేస్తారు. కాబట్టి సమయానికి పరీక్ష హాల్‌కి చేరుకోవాలి. మొదటి షిప్టు ఉదయం 7 గంటలకు, రెండో షిప్టు ఉదయం 11 గంటలకు, మూడో షిప్టు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. విద్యార్థులు ఏదైనా విడిగా రాయడానికి రఫ్ షీట్లు ఇస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ షీట్లను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో పరీక్ష రోజున అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అడ్మిట్ కార్డులో అభ్యర్థి సంతకం, ఫోటో స్పష్టంగా ఉండాలి. విద్యార్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. విలువైన వస్తువులు తీసుకెళ్లకూడదు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐఎం అహ్మదాబాద్ స్వయంగా విడుదల చేసింది.
అన్ని నియమాలను పాటించడం తప్పనిసరి
నవంబర్ 28 నుంచి క్యాట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఫేస్ మాస్క్, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఏ విధంగానైనా కాపీ చేస్తూ దొరికితే పరీక్ష నుంచి డిబార్ చేస్తారు. విద్యార్థులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి.