
అమరావతి, జులై 7: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ 2026 జూన్ )కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆదివారం (జులై 5) అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లే దాదాపు 74,295 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు 1,39,225 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,13,520 మంది టెట్ పేపర్1, పేపర్ 2లకు దరఖాస్తులు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో 2011కు ముందు నియమితులైన 1,05,715 మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంది. ఇందులో ఈసారి 74,295 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఇక టెట్ హాల్ టికెట్లు జులై 25వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఆన్‌లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) విధానంలో జరగనున్నాయి. ఏపీ టెట్ 2026 జూన్ సెషన్ ఫలితాలు సెప్టెంబర్ 15వ తేదీన వెల్లడిస్తారు. టెట్ ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గత డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులతోపాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు కలిపి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 90 మార్కులు అంటే 60శాతం, బీసీ అభ్యర్థులు 75 మార్కులు అంటే 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమెన్ అభ్యర్థులు 60 మార్కులు అంటే 40శాతం సాధిస్తే ఉత్తీర్ణత పొందుతారు. టీచర్ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే ఎన్ని సార్లు టెట్ నిర్వహించినా రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోటీ పడుతుంటారు.