Good News: అనాథల చదువుకు గొప్ప అవకాశం.. CBSE విద్యా, వసతి, భోజనం అన్నీ ఫ్రీ!

Heal Paradise Admissions 2026: బాల్యం కొందరికి వరమైతే.. మరికొందరికి శాపంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనంలోనే దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదంటే ఇద్దరినీ కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో పిల్లల చదువుతోపాటు వారి భవిష్యత్తు కూడా అక్కడితో అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి ప్రపంచమే ఆగిపోతుంది. ఇలాంటి నిరుపేద చిన్నారులకు చదువుతోపాటు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ 'హీల్‌ ప్యారడైజ్‌' అనే విద్యా సంస్థను ప్రారంభించారు..

Good News: అనాథల చదువుకు గొప్ప అవకాశం.. CBSE విద్యా, వసతి, భోజనం అన్నీ ఫ్రీ!
Heal Paradise School Admission Notification

Updated on: Dec 22, 2025 | 4:30 PM

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హీల్‌ ప్యారడైజ్‌ పాఠశాలలో చదువేకాదు ఉచితంగా నాణ్యమైన భోజనం, వసతి కూడా అందిస్తారు. కాలం చిన్నచూపుతో రోడ్డుప పడేసిన చిన్నారులకు ఉన్నత భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియం సీబీఎస్‌ఈ సిలబస్‌తో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ఉన్నత విద్యను అందిస్తారు.

హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

హీల్‌ ప్యారడైజ్‌లో వసతులు ఇలా..

హీల్‌ ప్యారడైజ్‌లో బాలబాలికలకు వేర్వేరుగా సకల సౌకర్యాలతో వసతి గృహాలు ఉన్నాయి. విద్యార్థులకు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో భోజన అందిస్తారు. సువిశాలమైన డైనింగ్‌ హాల్‌, సోలార్‌ వంటగది, ఆర్వో శుద్ధజలం, స్నానానికి వేడినీళ్లు, పాఠశాల క్యాంపస్‌లోనే ఆస్పత్రి.. ఇలా సొంత తల్లిదండ్రుల ప్రేమను మైమరిపించేలా అన్ని అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ గదుల్లో ఆన్‌లైన్‌ తరగతులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. క్రీడలకు అతిపెద్ద గ్రౌండ్‌, ఇండోర్‌ స్టేడియం కూడా ఉన్నాయి. ఇక్కడ చదువుతున్న అనేక మంతి విద్యార్ధులు నేషనల్‌, ఇంటర్‌ నేషనల్ స్థాయిలో క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కేంద్రం, ఏఐ ఎక్స్‌లెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైన్‌ థింకింగ్‌ వంటి అత్యధునిక సాంకేతిక సదుపాయాలు సైతం ఉన్నాయి. 15 వేల పుస్తకాలతో అతి పెద్ద లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో విద్యార్ధుల ఆసక్తి మేరకు శిక్షణ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక్కడ ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులకు మెడికల్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులకూ హీల్‌ సంస్థే సహకరిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అన్నీ తామై హీల్‌ ప్యారడైజ్‌ విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. హీల్‌ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ధ్యేయమని.. దేశంలోని ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడ ప్రవేశాలు పొందొచ్చని హీల్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా కోనేరు సత్యప్రసాద్ తెలిపారు. ఇక 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు హీల్‌ ప్యారడైజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌కు ప్రవేశాలు కల్పించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. అలాగే హీల్‌ అంధుల పాఠశాలలో కూడా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ మరో ప్రకటన జారీ చేసింది. హీల్‌ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత పొందిన వారికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు.

హీల్‌ ప్యారడైజ్‌లో 2026-27కు ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

1-9 తరగతులకు ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా ఎవరినో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనుకబడినవారు దరఖాస్తుకు అర్హులు. విద్యార్ధుల వయసు 6 నుంచి 15 ఏళ్ల వయసు ఉండాలి. పేరెంట్స్‌ మరణ ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్‌, తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలంటే పదో తరగతిలో 480 మార్కులు, సీబీఎస్‌ఈ లేదా ఐసీఎస్‌ఈ బోర్డు స్కూల్‌ అయితే 400పైన మార్కులు సాధించి ఉండాలి. వీరికి కూడా తెల్లరేషన్‌ కార్డు, ఆదాయ సర్టిఫికెట్‌ ఉండాలి. ఇక అంధ పాఠశాలలో ప్రవేశాలకు 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు అవకాశం ఉంటుంది. 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న విద్యార్ధులు మాత్రమే ప్రవేశాలకు అర్హులుగా హీల్‌ ప్యారడైజ్‌ వెల్లడించింది. విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 15, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 9100024435, 9100024438 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.