HCL Jobs: ఫ్రెషర్స్‌కి టెక్ దిగ్గజం రెడ్ కార్పెట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 కొత్త ఉద్యోగాలు..
HCL Jobs: కరోనా (Corona) పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియ వేగవంతమైంది...
HCL Jobs: కరోనా (Corona) పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు (recruitment) తగ్గిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ (IT) సంస్థల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియ వేగవంతమైంది. భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 35,000 నుంచి 40,000 ఫ్రెషర్స్‌ను తీసుకోవాలని చూస్తోంది. హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి. విజయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.
కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగుల వలసల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హెచ్‌సీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. వచ్చే ఏడాదిలో ఆదాయ పెరుగుదలలో టెలికాం, ఆర్థిక సేవలు, లైఫ్ సైన్సెస్, హెల్త్ విభాగాలు కీలక పాత్రలు పోషించవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌సీఎల్ ప్రస్తుత కేంద్రాల్లో కొన్నింటిని విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అమెరికాకు సమీపంలో ఒకే టైమ్‌జోన్ ఉండే ప్రాంతాల్లో (నియర్‌షోర్) రానున్న 3 నుంచి 5 ఏళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో 10వేల మంది ఉద్యోగులు ఉండగా 20,000 పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్ని యుద్ధం తమ సంస్థపై ఎలాంటి ప్రభావం చూపదని విజయ్ కుమార్ అన్నారు. ఐరోపా నుంచి వచ్చే ప్రాజెక్టులపై ప్రభావం పడలేదని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ల్లో తమ కంపెనీలు లేవని చెప్పిన విజయ్ కుమార్, తూర్పు ఐరోపా కేంద్రాలు పోలాండ్, రొమేనియా, బల్గేరియాల్లో ఉన్నాయన్నారు. అయితే ఈ కార్యాలయాల్లో మునుపటి విధంగానే పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..