దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2025 పరీక్ష దరఖాస్తు గడువు ఐఐటీ రూర్కీ పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 26వ తేదీతో ముగియగా.. తాజా నిర్ణయంతో అక్టోబర్ 3, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఎలాంటి ఆలస్య రుసుముతో లేకుండా అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆలస్య రుసుముతో అక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలు మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 2వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి.
కాగా గేట్ స్కోర్‌తో ఎమ్‌టెక్ కోర్సుల్లో ప్రవేశాలతోపాు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన గేట్ ప్రవేశపరీక్షకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వద్యార్ధులతోపాటు చివరి సంవత్సరం చదువుతున్న బీఏ, బీకాం, బీఎస్‌సీ డిగ్రీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్ధుకు నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఇక ఐఐటీలు గేట్ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు కల్పిస్తాయి.
ప్రకటన వివరాలు…
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025 పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో.. చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.. జిల్లాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో అయితే హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తు సమయంలో ఆయా పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకోవచ్చు.