
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు ఆగస్టు 27, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు సెప్టెంబర్ 27 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు గతంలో ప్రత్యేక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్‌ను ఇంజినీరింగ్ సైన్సెస్‌లో ఒక సెక్షన్‌గా చేర్చారు. దీంతో రోబోటిక్స్ పేపర్ కొత్తగా చేరినప్పటికీ మొత్తం పేపర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 30గా ఉంటుంది.
GATE స్కోర్‌ను ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్య ప్రవేశాలకు ఉపయోగించడంతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాల సమయంలోనూ పరిగణనలోకి తీసుకుంటారు. GATE 2027 స్కోర్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. GATE 2027 దరఖాస్తు ప్రక్రియలో డిజిలాకర్ ఖాతాను అనుసంధానం చేయడం తప్పనిసరి అని ఐఐటీ మద్రాస్ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందే అభ్యర్థులు తమ డిజిలాకర్ ఖాతాను క్రియేట్ లేదా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో డిజిలాకర్‌కు అనుమతి ఇచ్చిన అనంతరం అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫొటో, ధ్రువీకరించిన గుర్తింపు పత్రం నంబర్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను పోర్టల్ ఆటోమేటిక్‌గా సేకరించనుంది. దీనివల్ల దరఖాస్తు ప్రక్రియ మరింత వేగంగా, కచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
గుర్తింపు పొందిన ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ తదితర డిగ్రీల్లో మూడో సంవత్సరం లేదా అంతకంటే పై తరగతిలో చదువుతున్న విద్యార్థులు, అలాగే ఇప్పటికే సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు GATE 2027కు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు GATE 2027కు ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు అదే దరఖాస్తులో రెండు పేపర్లను ఎంపిక చేసుకోవాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. చెల్లించిన దరఖాస్తు ఫీజు కూడా తిరిగి చెల్లించరు. దరఖాస్తు ఫీజు కింద ఒక్కో టెస్ట్ పేపర్‌కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000, ఇతర కేటగిరీల అభ్యర్థులు, విదేశీ విద్యార్థులు ఒక్కో పేపర్‌కు రూ.2 000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
గేట్ 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
GATE 2027 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ), మల్టిపుల్ సెలక్ట్ ప్రశ్నలు (MSQ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 65 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తారు.
గేట్ 2027 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.