తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పదివేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు తీసివేయడం లేదని మంత్రి సబిత అన్నారు. మన ఊరు-మన బడి మొదటి దశ కింద 9,123 పాఠశాలలను జూన్ నాటికి సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ల్యాంగ్వేజ్ పండిట్స్, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మీడియం విద్యార్థులకు వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యా వాలంటీర్ల వేతనాలు ట్రెజరీలో నిలిచిపోయి ఉన్నాయని పరిష్కరించాలని అడిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల 14 పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేశామన్నారు. బాసర ఆర్జీయూకేటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు ఇచ్చాం. మహబూబాబాద్, కొత్తగూడెంలోని జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ క్యాంపస్‌ను ఫార్మా యూనివర్సిటీగా మారుస్తామని చెప్పారు. కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తామని సబిత తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.