ఢిల్లీ (Delhi) ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. ఈ స్కూల్ లో చేరేందుకు దేశంలోని 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు అందరూ అర్హులేనని వెల్లడించారు. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ వర్చువల్ పాఠశాల దేశ విద్యా విధానంలో మైలు రాయిగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ అభివర్ణించారు. దూరం, బాలికలను పాఠశాలకు పంపించలేకపోవడం వంటి కారణాలతో మధ్యలోనే చదువు మానేసే వారికి, డ్రాపవుట్ గా మారే వారికి ఈ వర్చువల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని, తరగతులు ఆన్‌లైన్‌లోనే (Online) జరుగుతాయని వివరించారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల అటెండెన్స్, పరీక్షలు వర్చువల్మోడ్లో జరిగుతాయి. కాపీ కొట్టేందుకు అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే వర్చువల్ విధానంలో బోధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వర్చువల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో టీచింగ్ జరగనుంది.
ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ విద్యారంగంలో మైలురాయి. వివిధ కారణాలతో స్కూల్ కు వెళ్లి చదువుకోలేని వారి కోసం ఈ వర్చువల్ పాఠశాలను ఏర్పాటు చేశాం. వర్చువల్ విధానంలోనే తరగతులు జరుగుతాయి. టీచర్లు పాఠాలు చెప్పే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. స్కూల్‌నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. విద్యార్థుల అటెండన్స్ కోసం ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. పరీక్షలు వర్చువల్విధానంలోనే జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. రెండు టెర్మ్-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
ఈ వర్చువల్ స్కూల్ దిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉంటుంది. డీబీఎస్ఈ ఆధ్వర్యంలోనే మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ఇస్తారు. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. రిజిస్ట్రేషన్ల ఆధారంగా బ్యాచ్ లను నిర్ణయిస్తారు.