హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కంప్యూటర్ చోరీకి గురైంది. కనిపించకుండా పోయిన కంప్యూటర్‌లో కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్నారు. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని, దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్ చైర్మన్ (వీసీ) అహ్మద్ తెలిపారు. ఈ ఏడాది ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. వైస్ చైర్మన్ పదవిలో కొనసాగిన వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా కూడా ఉన్నారని, ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు.
మండలికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్‌ను 2017లో కొనుగోలు చేశారు. గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని, అందువల్లనే దానిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామని కొందరు అధికారులు అంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేశామని తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజున ఉన్నపలంగా కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అసలు ఆ కంప్యూటర్‌లో ఏముంది? కంప్యూటర్ పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్క్‌లో భద్రపరిచారా? అలాగైతే హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? పాడైపోయిన కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ డేటా అంతా కూడా కనిపించకుండా పోయిన కంప్యూటర్‌లోనే స్టోర్ చేశారు. అసలా కంప్యూటర్ మాయం కావడం వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంలో అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.