దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కుల కేటాయింపుల విధి విధానాల రూపకల్పనకు సీబీఎస్ఈ బోర్డు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ…పది రోజుల్లోపు నివేదిక అందజేయాలని బోర్డు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు 10 రోజులే ఉండటంతో కమిటీ తక్షణం రంగంలోకి దిగనుంది. కమిటీ తొలి సమావేశం త్వరలోనే జరగనుంది. ఈ కమిటీ సమర్పించనున్న నివేదిక ఆధారంగా విద్యార్థుల ఉత్తీర్ణత, విధివిధానాలను సీబీఎస్ఈ బోర్డు ఖరారు చేయనుంది. సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతున్న 13 లక్షల మంది విద్యార్థులు…తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కుల కేటాయింపులకు సంబంధించి సమగ్రమైన విధి విధానాలను కమిటీ రూపొందించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాన్యం భరద్వాజ్ చెప్పారు. పది రోజుల్లోనే కమిటీ తుది నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఆ మేరకు త్వరలోనే బోర్డు దీనికి సంబంధించి విధివిధానాలను అధికారికంగా ఖరారు చేస్తుందని తెలిపారు. విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.
ఈ కమిటీలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విపిన్ కుమార్, ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉదిత్ ప్రకాష్ రాజ్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ నిధి పాండే, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్ గార్గ్, సీబీఎస్ఈ డైరెక్టర్(అకాడమిక్స్) జోసఫ్ ఇమాన్యుయేల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. యూజీసీ, ఎన్‌సీఈఆర్టీ నుంచి ఒక్కో ప్రతినిధి, సీబీఎస్ఈ స్కూల్స్ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు