CBSE Class 10th Results 2025: సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదిగో!
42 లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సీబీఎస్సీ10, 12 తరగతుల ఫలితాలు మంగళవారం (మే 13) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం తొలుత 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు.. 2 గంటల తర్వాత పదో తరగతి ఫలితాలు కూడా వెల్లడించింది. ఈ కింది డైరెక్ట్ ద్వారా ఫలతాలు చెక్ చేసుకోండి..

హైదరాబాద్, మే 13: దేశవ్యాప్తంగా 42 లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సీబీఎస్సీ10, 12 తరగతుల ఫలితాలు మంగళవారం (మే 13) విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం తొలుత 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు.. 2 గంటల తర్వాత పదో తరగతి ఫలితాలు కూడా వెల్లడించింది. బోర్డు మంగళవారం ఈ రిజల్ట్స్ ప్రకటించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, cbse.gov.in, results.cbse.nic.inల ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024-25 విద్యాసంవత్సరానికి 10వ తరగతి బోర్డు పరీక్షలకు దేశ వ్యాప్తంగా 2,371,939 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,221,636 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే మొత్తం 93.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 2024 కంటే 0.06 శాతం ఎక్కువ అని సీబీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 1.99 లక్షలకు పైగా అభ్యర్థులు 90 శాతానికి పైగా స్కోరు సాధించగా, 45 వేలకు పైగా అభ్యర్థులు 95 శాతానికి పైగా స్కోరు సాధించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 మధ్య ఈ పరీక్షలు జరిగాయి.
సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాల్లో త్రివేండ్రం 99.79 శాతం ఉత్తీర్ణతతో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో విజయవాడ, బెంగళూరు, చెన్నై, పూణే ఉన్నాయి. CBSE విడుదల చేసిన ఫలితాల్లో గౌహతి 84.14 శాతం ఉత్తీర్ణతతో అట్టడుగున ఉంది.12వ తరగతితోపాటు, 10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో కూడా బాలికలు సత్తా చాటారు. పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత శాతం 95 శాతం కాగా, బాలుర విషయంలో ఇది 92.63 శాతం. విద్యార్ధుల మధ్‌య అనారోగ్యకరమైన పోటీని తగ్గించే లక్ష్యంతో సీబీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేయలేదు. జాతీయ స్థాయిలో టాపర్ల పేర్లను కూడా జారీ చేయలేదు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




