TSPSC Group 4 Exam: గ్రూప్‌-4 పరీక్షకు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఆదేశాలు

|

Jun 24, 2023 | 12:33 PM

తెలంగాణ రాష్ట్రంలో జులై 1న గ్రూప్‌-4 పోస్టులకు రాతపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది..

TSPSC Group 4 Exam: గ్రూప్‌-4 పరీక్షకు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఆదేశాలు
TSPSC Group 4
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జులై 1న గ్రూప్‌-4 పోస్టులకు రాతపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది. దీని ప్రకారంగా పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలకు అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్‌ పత్రాల్ని అందజేయనున్నారు. గ్రూప్‌ 1 పరీక్షకు బయోమెట్రిక్‌ తీసుకోకుండా పరీక్ష నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్‌ 4 పరీక్షలకు బయోమెట్రిక్‌ తప్పరిసరి చేసింది.

కాగా ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 8,180 గ్రూప్‌-4 పోస్టులకుగానూ 9.51 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. భారీ సంఖ్యలో ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తుండటంతో జిల్లాకేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్పీయస్సీ సమావేశాలు నిర్వహించింది. రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. దీనిలో భాగంగా హాజరుపట్టీలో ఫొటోను, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్‌ స్పష్టం చేసింది. ఓఎంఆర్‌ పత్రాల్లో అభ్యర్థులు హాల్‌టికెట్‌ నంబరు, ప్రశ్నపత్రం కోడ్‌, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుందని తెల్పింది. గ్రూప్‌-4 పరీక్ష హాల్‌టికెట్లు ఈ రోజు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.