Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇదీ.. ఎంత బాగా పరీక్ష రాస్తే మాత్రం మరీ 100కు 257 మార్కులా? గుడ్లు తేలేసిన విద్యార్ధి..

మనలో చాలా మందికి అకగమిక్ పరీక్షలు రాసిన అనుభవం ఉంది. కొన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత బాగా రాసినా టీచర్ మాత్రం వందకు మించి ఒక్క మార్కు కూడా అదనంగా వేయడం జరగదు. అయితే ఓ విద్యార్ధికి మాత్రం పరీక్షలో వందకు ఏకంగా 257 మార్కులు వచ్చాయి. అంతే సదరు విద్యార్ధితోపాటు రాష్ట్ర మంతా ఇదేలా సాధ్యం అంటూ తికమకలో పడిపోయారు..

ఇదేందయ్యా ఇదీ.. ఎంత బాగా పరీక్ష రాస్తే మాత్రం మరీ 100కు 257 మార్కులా? గుడ్లు తేలేసిన విద్యార్ధి..
University In Bihar Gives Students Beyond Distinction
Srilakshmi C
|

Updated on: Jul 04, 2025 | 4:53 PM

Share

పరీక్షలు బాగా రాస్తే వందకు వంద మార్కులు ఇస్తారు. మరీ బాగా రాస్తే ‘వెరీ గుడ్‌’ అని కాంప్లిమెంట్ ఇస్తారు. అంతేగానీ వందకు మించి మార్కులు వేయడం దాదాపు అసాధ్యం. అలాంటిది ఓ యూనివర్సిటీ మాత్రం అక్కడి విద్యార్ధులకు వందకు ఏకంగా 257 మార్కులు ఇచ్చి.. ఆనక నాలుక కరచుకుంది. ఈ విచిత్ర ఘటన ముజఫర్‌పూర్‌లోని బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. సదరు వర్సిటీ అనుసరించిన ఫార్ములా ఏమిటో తెలియక గణిత శాస్త్రజ్ఞులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..

బీహార్‌ యూనివర్సిటీ ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడవ సెమిస్టర్ ఫలితాలు (2023–25) వెల్లడించింది. అందులో వర్సిటీకి చెందిన ఓ విద్యార్ధికి 100 మార్కుల థియరీ పేపర్‌లో ఏకంగా 257 మార్కులు వచ్చేశాయి. మరోవైపు 30 మార్కుల ప్రాక్టికల్ పరీక్షలోనూ కనీవినని రీతిలో 225 మార్కులు వచ్చాయి. మ్యాథమెటిషియన్లు ఎంతగా బుర్ర బద్ధలు కొట్టుకున్నా అసలు అన్ని మార్కులు ఎలా వచ్చాయో అర్ధంకాకుంది. మరో ట్విస్ట్‌ ఏంటంటే.. ఇంత చేసీ పరీక్షలో అపరిమితంగా మార్కులు తెచ్చుకున్న సదరు విద్యార్ధి మాత్రం పై తరగతికి ప్రమోట్‌ కాకపోవడం కొసమెరుపు.

పరీక్షకు హాజరైన దాదాపు 9 వేల మంది విద్యార్థులలో 8 వేల మంది ఉత్తీర్ణులయ్యారని తాజా ఫలితాల్లో ప్రకటించారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు పెండింగ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో చాలామంది విద్యార్ధులు తమకు ఇంటర్నల్‌ మార్కులను సమర్పించలేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్, సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఇక ఫెయిలైన వర్సిటీ విద్యార్థుల్లో అధిక మంది కేవలం 1, 2 మార్కుల తేడాతో ఫెయిల్ కావడం వింతల్లోనే వింతగా మారింది. దీంతో ఫలితాలపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కొంతమంది విద్యార్థులకు మొత్తం మార్కులను మించి మార్కులు రావడం, మరికొందరికి కేవలం 1,2 మార్కులతో ఫెయిల్‌ అవ్వడం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీనిపై వర్సిటీ చీఫ్‌ ఎగ్జామినర్‌ మాట్లాడుతూ.. ఫలితాలను ఎక్సెల్ షీట్ ఎంట్రీల సమయంలో జరిగిన తప్పిదం వల్ల ఇలా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. మార్కుల ఎంట్రీని సరిచేసి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అప్పుడప్పుడు టైపింగ్ తప్పులు జరుగుతుంటాయని, అయితే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ రామ్ కుమార్ వివరణ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.