
అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జారీ చేసింది. త్వరలో నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ రోజు (ఫిబ్రవరి 13) విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను అభ్యర్థులు ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని అందులోని సూచనలను పాటించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జనవరి 5వ తేదీన నిర్వహించవల్సి ఉంది. కానీ అప్పట్లో మెగా డీఎస్సీ హడావిడిలో ఈ పరీక్ష నిర్వహణ సాధ్యంకాదని కమిషన్ వాయిదా వేసింది.
అయితే నాటకీయ పరిణామాల దృష్ట్యా మెగా డీఎస్సీ ప్రకటన వెలువడకపోగా మరింత ఆలస్యమైంది. ఇందుకోసం వాయిదా వేసిన గ్రూప్ పరీక్ష కూడా చాలా రోజుల వరకు వాయిదా పడింది. మరోవైపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలన్నీ బిజీగా మారనున్నాయి. అందుకే ఈ పరీక్షలన్నింటికంటే ముందుగానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని భావించిన కమిషన్.. ఆ మేరకు ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొత్తం 13 జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష సాయంత్రం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా గత ప్రభుత్వ హాయంలో గతేడాది డిసెంబర్ 7న గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. అనంతరం రెండు నెలల వ్యవధిలోనే అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 92, 250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీని రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా మొత్తం 905 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.