ప్రత్తిపాడు, జనవరి 10: ఇంటర్ చదివిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రోన్ ఆపరేటింగ్‌లో శిక్షణ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారి కె అరుణ కుమారి తెలిపారు. 80 శాతం రాయితీతో ప్రభుత్వం డ్రోన్ సరఫరా చేస్తుందని అన్నారు. అయితే ప్రత్తిపాడు మండలానికి కేవలం రెండు డ్రోన్లకే అవకాశం ఉందని.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. తుమ్మలపాలెం, యనమదల గ్రామాల్లో జనవరి 8న జరిగిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ రోజు గ్రామాల్లోని మొక్కజొన్న, శనగ పంటను ఆమె పరిశీలించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రిమియం చెల్లించేందుకు జనవరి 15 చివరి తేదీ అని తెలిపారు. రబీలో శనగ, మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024 పరీక్ష తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. గత ఏడాది డిసెంబర్ 14, 15 తేదీల్లో ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్‌లైన్ విధానంలో సీటెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా సీటెట్ పరీక్ష ప్రతీ యేట రెండు సార్లు నిర్వహిస్తుంటారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి ఉంటుంది. రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతుల వరకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్‌కు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
సీటెట్ 2024 తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.