AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Online Application: ఫిబ్రవరి 1 నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ.. 6,000 పోస్టులకు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఒకేసారి కాకుండా.. విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో టెట్‌ పరీక్షకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయిస్తారు. ఒక వేళ టెట్‌కు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం..

AP TET 2024 Online Application: ఫిబ్రవరి 1 నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ.. 6,000 పోస్టులకు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌
AP TET 2024
Srilakshmi C
|

Updated on: Jan 30, 2024 | 1:30 PM

Share

అమరావతి, జనవరి 30: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఒకేసారి కాకుండా.. విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో టెట్‌ పరీక్షకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయిస్తారు. ఒక వేళ టెట్‌కు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. టెట్‌ తర్వాత10-15 రోజులు కాస్త అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, అనతరం పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 6వేల పోస్టులను డీఎస్సీలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, టెట్‌, డీఎస్సీకి సంబంధించి జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం వెనువెంటనే షెడ్యూల్‌ ప్రకటిస్తారు. మొదట టెట్‌ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈసారి టెట్‌, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించనున్నారు.

విడివిడిగా టెట్‌, డీఎస్సీ పరీక్షలు

ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉన్నవారు మాత్రమే టెట్‌ రాసేందుకు అర్హులు. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో 40 శాతం అర్హత మార్కులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని ఈ ఒక్కసారి మాత్రమే అనుమతిస్తామని, తదుపరి జరిగే డీఎస్సీ పరీక్షలకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పట్లో మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టులకు 6.08 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు కూడా బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించారు. దీంతో ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్‌ కలిపి ఒకేసారి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం టెట్‌, డీఎస్సీ పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టెట్‌, డీఎస్సీ రెండింటికీ సకాలంలో పరీక్షలు జరుగుతాయో.. లేదోనన్న సందేహంలో నిరుద్యోగులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.