AP 10th Results: ఏపీ SSC ఫలితాల డేట్ ఫిక్స్ అయ్యిందా? విద్యాశాఖ తాజా క్లారిటీ
AP 10th Class Results Date: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 25న వస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించింది. పది పరీక్షల ఫలితాలపై అధికారిక ప్రకటన రాలేదని, విద్యార్థులు–తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల తేదీపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై విద్య శాఖ స్పందించింది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో పదో తరగతి పరీక్షల తేదీపై తప్పుడు ప్రచారాలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికలు, వాట్సాప్ గ్రూపులలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 25, 2026న విడుదల అవుతాయని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ స్పందిస్తూ.. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
పరీక్షల నిర్వహణ, మూల్యాంకణ ప్రక్రియ, ఫలితాల ప్రాసెసింగ్ ప్రతి దశలోనూ అత్యున్నత స్థాయి పారదర్శకత, గోప్యత, నిష్పాక్షికత, బాధ్యాయుత విధానాలతో నిర్వహిస్తున్నట్లు విద్య శాఖ స్పష్టం చేసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, మంగళగిరి, అమరావతి వారి నుంచి ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫలితాల విడుదల తేదీని తగిన సమయంలో అధికారికంగా తెలియజేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
SSC పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసే వ్యక్తులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ కుమార్ పేర్కొన్నారు.
