అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 26 జిల్లాలో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10,02,150 మంది రెండు సంవత్సరాలకు కలిపి ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ రిజల్ట్స్‌కు సంబంధించి కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఫస్ట్ ఇయర్ ఏఎస్ఆర్ జిల్లాలో 48 శాతం ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్‌లో చిత్తూరు 63 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం పొంది తొలిస్థానంలో నిలిచింది.
అయితే పరీక్షలు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్దులకు ఇంటర్ బోర్డు ముఖ్య ప్రకటన జారీ చేసింది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 18, 2024 నుంచి ఏప్రిల్ 24, 2024వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దీని ద్వారా అభ్యంతరం లేవనెత్తిన విద్యార్ధుల ఇంటర్ జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసేందుకు, మార్కులను మరోమారు కౌటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వానియోగ పరచుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.
ఒక వేళ ఎవరైనా ఫెయిల్ అయితే ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, విద్యార్ధులు ఎవరైనా ఒత్తిడి చెందుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు వెంటనే ఈ కింది హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ AP Telemanas- 14416, Roshini Healpline – 8142020044, 81 42020033, ఐలైఫ్ – 7893078930, నిమ్‌హాన్స్ టోల్ ఫ్రీ నెంబర్ 080 46110007లను సంప్రదించి నిపుణుల కౌన్సెలింగ్ పొందవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.