
అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.
మే 18 నుంచి జూన్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ క్రీడా ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు మరియు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రత్యేక కమిటీ పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేయనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. క్రీడల్లో రాణించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.