విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు విడుదల
AP EAPCET 2026 Result date and Time: రాష్ట్రంలో లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న AP EAPCET 2026 ఫలితాలు జూన్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫలితాలను ప్రకటించనుండగా, ఈ పరీక్షకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది.

అమరావతి, జూన్ 28: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు జూన్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
కాగా మే 12 నుంచి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిదే. ఈ ఏడాది ఈఏపీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2.5 లక్షల మంది విద్యార్థులు, బైపీసీలో 70,929 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ మే 25న విడుదల చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఫలితాలు జూన్ 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు రాసిన ఇంప్రూవ్‌మెంట్, సీబీఎస్‌ఈ రివ్యాల్యూయేషన్ ఫలితాల కారణంగా ఫలితాల విడుదల రెండు సార్లు వాయిదా పడింది. ఈ రెండు అడ్డంకులు తొలగిపోవడంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ర్యాంకులు కేటాయించాలంటే ఇంటర్మీడియట్ మార్కులూ తప్పనిసరి. ఈ కారణంగానే విద్యార్ధులు నష్టపోకూడదని ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలు వచ్చేంత వరకు ఈఏపీసెట్ ఫలితాలను వాయిదా వేసింది. ఎట్టకేలకు ఫలితాలు వెలువడనుండటంతో విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఫలితాల విడుదల అనంతరం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మరోవైపు తెలంగాణలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రస్తుతం తొలి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది.




