అమరావతి, మే 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేటి నుండి ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 23 వరకు జరిగే ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. 49 రీజనల్ సెంటర్స్ లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. నంద్యాలలో మరో 2 పరీక్ష కేంద్రాలు మార్పు చేశారు. రోజుకు రెండు ఫిష్టుల్లో జరిగే పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం అయ్యే ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ లోకి అభరణాలతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం చేశారు. అభ్యర్థులు మెహందీ పెట్టుకుంటే బయోమెట్రిక్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని, ఎవరూ టాటూలు, గోరింటాకుతో పరీక్షలకు రావొద్దని సూచించారు. హాల్‌టికెట్ వెనుక భాగంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి రూట్ మ్యాప్ ఇచ్చామని న్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విద్యార్ధులకు సూచించారు.
బైపీసీ విద్యార్థులకు 16, 17 తేదీల్లో నాలుగు విడతలుగా పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీ వారికి 18 నుంచి 23 వరకు తొమ్మిది విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో బాలురు 1,80,104 మంది, బాలికలు 1,81,536 మంది ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు నిర్వహిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.