అమరావతి, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అసక్తి కలిగిన వారు డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి టెట్ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవడానికి ఒక్కొక్క దానికి 3 నెలల చొప్పున వ్యవధి ఇచ్చింది. ఇప్పటికే టెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా త్వరలోనే హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 (జులై) పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం మొదటి సెషన్ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 22 తర్వాత నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్ 4 నుంచి ప్రాథమిక ‘కీ’ అందుబాటులో ఉంచనున్నారు.
అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్ 27వ తేదీ తుది ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. నవంబర్ 2న టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తారు. అంతా అనుకున్నట్ల జరిగితే అదే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.