అమరావతి, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-డీఎస్సీ)ల షెడ్యూల్‌ను వెంటనే మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం (మార్చి 4) ఆదేశించింది. హడావుడిగా పరీక్షలను నిర్వహిన్నట్లు ఉందని, టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే ప్రాథమిక కీ విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణకు కనీసం వారం రోజుల గడువు ఉండేలా హెడ్యూల్‌ను రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు టెట్, డీఎస్సీ షెడ్యూల్‌లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. పేపర్1 ఎస్జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని కోర్టు స్పష్టత ఇచ్చింది.
ఏపీ టెట్ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేయగా, అదే నెల 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోర్టు గుర్తు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12న జారీ చేసి, పరీక్షలు మార్చి 15 నుంచి నిర్వహించబోతున్నారని తెలిపింది. టెట్, డీఎస్సీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు తగిన సమయం ఇవ్వాలని సూచించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, వాటి పరిష్కారం, తదనంతరం జారీ చేసే తుది కీ విడుదలకు అత్యంత తక్కువ సమయం ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది. ఈ విధమైన నిర్ణయం సహేతుకంగా లేదని, అభ్యర్థులకు సముచిత సమయం ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమేనని న్యాయస్థానం తెలిపింది.
2018లో జరిగిన టెట్, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని కోర్టు పేర్కొంది. డీఎస్సీ నోటిఫికేషన్ తేదీకి, పరీక్ష నిర్వహణకు మధ్య 60 రోజుల సమయం ఇచ్చారని పేర్కొంది. కానీ ఇప్పుడు మాత్రం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఆ నోటిఫికేషన్ షెడ్యూల్‌లో ప్రాథమిక కీ విడుదల నుంచి అభ్యంతరాల స్వీకరణ, తుది కీ జారీకి మధ్య సహేతుకమైన సమయం ఇచ్చారని ఈ సందర్భంగా కోర్టు వెల్లడించింది. ఈ ఏడాది ఇచ్చిన ప్రస్తుత నోటిఫికేషన్ విషయంలో కూడా అధికారులు ఆ తరహా షెడ్యూల్‌ను పాటించాలని అభిప్రాయపడింది. సమయాన్ని కుదిస్తూ, షెడ్యూల్ కుదించి, హడావిడిగా ఎందుకు నోటిఫికేషణ్ ఇచ్చారో తమకు అర్థం కావడం లేదని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రక్రియ వల్ల పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారని, కోర్టు ఆదేశించిన మేరకు ప్రతి దశలో తగిన సమయమిస్తూ షెడ్యూల్ మార్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ తీర్పు సందర్భంగా వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.