అమరావతి, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో రోజుకు సెషన్ల చొప్పున అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్ పరీక్ష 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్ పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఒక్కో సెషన్ పరీక్ష 2.30 గంటల వరకు జరుగుతుంది. ఇక ఇప్పటి వరకూ జరిగిన ఏపీ టెట్ జులై-2024 పరీక్షల ఆన్సర్ కీలను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ వేర్వేరుగా విడుదల చేసింది. వీటితో పాటు అభ్యర్ధుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మిగిలిన ‘కీ’లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల అవుతాయి.
కాగా టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు 21వ తేదీ వరకు జరుగనున్నాయి. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాథమిక ‘కీ’లపై త్వరలోనే అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 27న తుది ‘కీ’ విడుదల చేస్తారు. నవంబర్ 2న టెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
ఏపీ టెట్ 2024 (జులై) ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ టెట్ 2024 (జులై) రెస్పాన్స్ షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఈ సారి మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్‌కు భారీగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 108 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 95 కేంద్రాలు, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంల్లో మరో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో 24,396 మంది పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి వీలవుతుంది. అలాగే డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.