అమరావతి, జూలై 28: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు జులై 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అయితే టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగింపుపై తాజాగా ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. టెట్ దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు స్పందిస్తూ.. టెట్ దరఖాస్తు గడువును పొడిగించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అర్హులైన అభ్యర్థులు గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయరామరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు విడతల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మైనార్టీ అభ్యర్థులకు టెట్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బుద్ధులు, జైనులు వంటి తదితర మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉర్దూ, తెలుగు మీడియంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు టెట్ 2024 పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టెట్ 2024 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు సూచించారు.