AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. సాధారణంగా ప్రతీ ఏటా జూన్ 12న స్కూళ్లు ప్రారంభమైన ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది ఈ తేదీలో మార్పులు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. తాజాగా అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం జులై 5 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వాస్తవానికి విద్యా శాఖ తొలుత జులై 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని భావించింది. కానీ ఆరోజు ప్రధాని ఏపీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా స్కూళ్లను ఓపెన్ చేయనున్నారు. ఇక ఈ ఏడాది స్కూళ్లు మొత్తం 220 రోజులు పని చేస్తాయి.
1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఇక సెలవుల విషయానికొస్తే ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ 26వ తేదీని నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.
స్కూళ్లు జులై 5వ తేదీని ప్రారంభమవుతున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం బడులకు ఈ నెల 28వ తేదీని నుంచి వెళ్లాల్సి ఉంటుంది. స్కూల్స్ ప్రారంభం నాటికి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదులను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాత పుస్తకాలను సేకరించి బుక్ బ్యాంకు ఏర్పాటు చేయాలని సూచించింది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిపి సమావేశాలు నిర్వహించడం, 30న ప్రవేశాల కోసం సమీపంలోని పాఠశాలలకు ఆశ్రయించడం, గూగుల్ రీడింగ్ కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుల నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. విద్యా కానుకల కిట్లను జులై 5న పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..