
అమరావతి, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలీసెట్ 2025 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. జూన్ 20వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ (మొదటి విడత) వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించడానికి జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించాలి. ధ్రువపత్రాల పరిశీలన జూన్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు జూన్ 25 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది.
జులై 1న ఐచ్ఛికాల మార్పు, సీట్ల కేటాయింపు జూలై 3న సాయంత్రం 6 గంటల తర్వాత తొలి విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు వెల్లడించింది. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 4 నుంచి 8 లోపు కళాశాలల్లో చేరాలని సూచించింది. అలాట్ మెంట్ కాపీని అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. అలాట్ మెంట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. అనంతరం అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన సంబంధింత కాలేజీలో సమర్పించి, సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.
కాగా గత నెలలో విడుదలైన ఏపీ పాలిసెట్ 2025 ఫలితాల్లో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ కౌన్సెలింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఇతర సందేహాలకు మెయిల్ ఐడీ – convenorpolycetap2025@gmail.com లేదా హెల్ప్ లైన్ నెంబర్లు – 7995681678, 7995865456, 9177927677ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.