AP Mega DSC 2024 Release Date: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ ఇదే.. ఫ్రీ కోచింగ్‌కు రేపటితో ముగుస్తున్న గడువు
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం ఎప్పుడెప్పుడాని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకన్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది..
అమరావతి, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ త్వరలో జారీకి ఏర్పాట్లు చేస్తుంది. అందిన సమాచారం మేరకు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ కూడా యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదలవనున్నాయి. విభాగాల వారీగా చూస్తూ.. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి.
వెబ్‌సైట్లో అన్ని సబ్జెక్టులు టెట్ ప్రిలిమినరీ కీలు అందుబాటులోకి
ఏపీ టెట్ జులై-2024 పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీలు అన్నింటినీ విద్యాశాక విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను సెషన్ల వారీగా పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. పేపర్ 2ఎ సోషల్ స్టడీస్ పరీక్ష ఆన్సర్ ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 25లోపు దాఖలు ఆన్‌లైన్‌లో దాఖలు తెలియచేయాలని సూచించింది. కాగా టెట్ జులై సెషన్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరిగాయి. టెట్ తుది ఆన్సర్ ‘కీ’ అక్టోబర్ 27న విడుదల కానుంది. ఇక టెట్ ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు.
రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు
మరోవైపు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు కూటమి సర్కార్ రాష్ట్రంలోని నిరుపేద అభ్యర్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రేపటి (అక్టోబర్ 25)తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. రాత పరీక్ష, టెట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తారు. ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు.