AP Inter Public Exams 2025: ఈసారి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలోనే.. పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు!

AP Intermediate Public Exams 2025 to be held in February: 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు యేటా ఇంటర్ పరీక్షలు కేవలం మార్చి నెలలోనే జరిగేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక నెల ముందుగానే అంటే 2026 ఫిబ్రవరి నెలలోనే ఈ పరీకలు జరగనున్నాయి..

AP Inter Public Exams 2025: ఈసారి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరిలోనే.. పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు!
AP Intermediate Exams 2025

Updated on: Aug 31, 2025 | 2:54 PM

అమరావతి, ఆగస్ట్‌ 31: రాష్ట్ర ప్రభుత్వం యేటా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి నెలలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రం ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను నెల ముందుగానే నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్టు బోర్డు తెలిపింది. అంటే సీబీఎస్సీ పరీక్షలతోనే ఇంటర్ పరీక్షలు కూడా జరగనున్నాయి. దీనివల్ల పరీక్షలు త్వరగా ముగించి, ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించేందుకు వీలవుతుందని బోర్డు భావిస్తోంది.

మరోవైపు పరీక్షల నిర్వహణ విధానంలోనూ ఇంటర్‌ బోర్డు కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు లాంగ్వేజ్‌ పరీక్షలు ముందుగా నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం పబ్లిక్‌ పరీక్షల్లో మొదట సైన్స్‌ గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదేరోజు బైపీసీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి మాత్రం అలా జరుగదు. ఒక్కోరోజు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది కొత్తగా ‘ఎంబైపీసీ’ గ్రూపును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు. దీనివల్ల ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త విధానంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇక సైన్స్ గ్రూపు సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రోజుకో పరీక్ష పరీక్షరాసుకునే వీలు కల్పించింది. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలా? రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా? అనే దానిపై బోర్డు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.