అమరావతి, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతులకు, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) క్వశ్చన్ పేపర్లను అందించనుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్ధులకు Class Room Based Assessment (సీబీఏ-3) నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే సీబీఏ పరీక్షకు విద్యార్థులకు క్వశ్చన్ పేపర్‌తో పాటు ఓఎంఆర్ షీట్‌ను కూడా అందిస్తారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్ధులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే ఓఎంఆర్ షీటును ఇవ్వనున్నారు. 6,7,8 తరగతులకు లాంగ్వేజ్ పరీక్షలకు ఒక ఓఎమ్మార్ షీట్, భాషేతర సబ్జెక్టుకు మరో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఓమ్మార్ షీట్ అందించరు. వారికి ప్రశ్నపత్రమే ఇస్తారు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లోని 8,9 తరగతుల విద్యార్ధుకలు ఏప్రిల్ 12వ తేదీన టోఫెల్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల తర్వాత ఏప్రిల్ 22న పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ మీటింగ్‌లో విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు వివరిస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తగరతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. కాగా ఈ ఏడాది మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62,983 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన హాల్ టికెట్లు ఈ రోజు నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి డైన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.