SSC Public Exams: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. విద్యార్ధులు సౌలభ్యం మేరకు తెలుగు మీడియంలోనూ పరీక్షలు రాయొచ్చంటూ ప్రకటన జారీ చేసింది..
అమరావతి, నవంబర్ 21: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ తీపికబురు చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు తెలియజేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో విద్యార్ధులు మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది. గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 6 తరగతుల విద్యార్ధులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ 2020-21లో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ‘ఇంగ్లిష్ మీడియం’ అని వాడకుండా ‘ఒకే మాధ్యమం’ ఉండాలని కోర్టు ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లు వ్యవహరించారు. దీంతో ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది కోర్టు స్పష్టంగా చెప్పకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో కూటమి సర్కార్ ఈ ఒక్క ఏడాదికి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న విద్యార్ధులు 6.20 లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేలకుపైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెబుతున్నారు. ఇక విద్యార్థులు కూడా మాతృభాషలోనే చదువుతున్నారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పదో తరగతికి వచ్చిన తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించిన విద్యాశాఖ ఈ ఏడాదికి తెలుగు మీడియంలో పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షల ఫీజును నంబరు 26 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు అవకాశం ఉంది.