
అమరావతి, అక్టోబర్ 26: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజా ప్రతిపాదనల మేరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను కూడా విద్యాశాఖ విడుదల చేయనుందిది. ప్రస్తుతం పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.
నవంబర్ 13వ తేదీలోపు విద్యార్ధులు తమ పాఠశాలల్లోని హెడ్‌మాస్టర్లకు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఇక పాఠశాలల హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14వ తేదీలోపు ఫీజు చెల్లింపులు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్‌టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా విద్యాశాఖ ముద్రించనుంది. అందులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వచ్చేస్తుంది.
మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబరు నుంచి విద్యాశాఖ అమలు చేయనుంది. పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి విద్యార్థులెవరినీ డ్రాప్ బాక్సులో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో టెన్త్ ఫలితాల్లో వెనుకబడిన 100 పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ తప్పనిసరిగా అపార్ ఐడీ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.