
అమరావతి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షల హాల్ టికెట్లను జారీ చేసింది. అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల మాదిరి టెన్త్ హాల్ టికెట్లను కూడా వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత సేవలను ఎంచుకొని, హాల్ టికెట్ పొందవచ్చని ఆయన సూచించారు. అలాగే పాఠశాల లాగిన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు చెల్లించలేదని హాల్ టికెట్లు నిలిపివేస్తున్నట్లు గతంలో పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఈసారి ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం నేరుగా విద్యార్ధుల మొబైల్ ఫోన్లకు నేరుగా హాల్ టికెట్లను పంపించి, అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాగా షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. సైన్స్ పేపర్లకైతే ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.