
అమరావతి, జనవరి 21: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్య సంవత్సరానికి మర్చి 16వ తేదీ నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అయితే ఈ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గతేడాది నవంబరులో విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దీన్ని జనవరి 21వ తేదీకి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అందుకు కారణం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పబ్లిక్ హాలిడేస్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారం మార్చి 20వ తేదీన రంజాన్ పండగ వస్తుంది. దీంతో మార్చి 20న జరగవల్సిన పరీక్షను మార్చి 21వ తేదీకి మార్పు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ నుంచి ఆమోదం వచ్చిన అనంతరం సవరించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేయనుంది. అయితే మిగతా పరీక్షలన్నీ యథాతథంగా ఇచ్చిన తేదీల్లోనే జరుగుతాయని, వీటిల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
ఒక్కో పరీక్షకు మధ్యలో సన్నద్ధతకు భారీగా సెలవులు రావడంతో విద్యార్ధులు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.