AICTE కొత్త మార్గదర్శకాలు..12 భాషల్లో టెక్ట్స్ బుక్స్, ఆ కోర్సులకు అధనంగా సీట్ల కేటాయింపు, ఇంకా..
ద్యార్థుల ఆదరణ ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ ఇతర వృత్తివిద్యా కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) అదనంగా సీట్లు మంజూరు చేయనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా..
AICTE Guidelines 2022-23: విద్యార్థుల ఆదరణ ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ ఇతర వృత్తివిద్యా కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) అదనంగా సీట్లు మంజూరు చేయనుంది. కళాశాలలోని మొత్తం సీట్లలో 95 శాతం కంటే ఎక్కువ నిండితే ఆ కళాశాలకు 25 శాతం సీట్లు అదనంగా కేటాయిస్తారు. 80-95 శాతం భర్తీ అయిన వాటికి 15 శాతం పెంచుకోవడానికి అనుమతి ఇస్తారు. కాకపోతే కేంద్ర విద్యాశాఖ ఏటా ఇచ్చే ర్యాంకింగ్‌లో 100లోపు స్థానాల్లో ఉండాలని షరతు విధించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మంగళవారం (మార్చి 29) కళాశాలల అనుమతుల విధివిధానాలను విడుదల చేసింది. కోర్ బ్రాంచీలైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచీల్లో సీట్లను పూర్తిగా తగ్గించడానికి వీల్లేదు. కావాలంటే 60 సీట్లను 30కి కుదించుకోవచ్చు. పాలిటెక్నిక్ కళాశాలల్లో సగం సీట్లూ నిండకపోవడం వల్ల కొత్త కళాశాలలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంచేసింది.
వచ్చే విద్యా సంవత్సరాని(2022-23)కి అనుమతుల కోసం ఏప్రిల్ 22వ తేదీ తుది గడువుగా నిర్దేశించింది. అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు అవకాశం కల్పించింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సాంకేతిక కోర్సులకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంది. ఏఐసీటీఈ నిబంధనలు మాత్రం పాటించాలని సూచించింది. దూర విద్య, ఆన్‌లైన్ కోర్సుల (online courses)కు మాత్రం అనుమతి తీసుకోవాలని పేర్కొంది.
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు పాలిటెక్నిక్‌లలోని ప్రతి కోర్సులో రెండు సీట్లు అదనంగా కేటాయించి వారికి రిజర్వు చేయాలి. ‘పీఎం కేర్స్’ కింద ధ్రువపత్రం పొందిన వారికి ప్రవేశాలు కల్పించాలి. ఒకే యాజమాన్య పరిధిలో కిలోమీటర్ పరిధిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కళాశాలలు ఉంటే వాటిని విలీనం చేసుకోవచ్చు. వాటిలోని మొత్తం సీట్లకు అనుమతి ఇస్తారు. కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై నిషేధాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. అయితే కొన్ని షరతులతో అనుమతులు ఇస్తారు. ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు వీలుగా 12 భాషల్లో అనువాద పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. ఎన్‌బీఏ గుర్తింపుంటే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు ప్రారంభించుకోవచ్చు. విశ్వ మానవ విలువలు పేరిట మైనర్ డిగ్రీ కోర్సును వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెడతారు. దానికి 18-20 క్రెడిట్లు ఇస్తారు.
Also Read: