ISRO YUVIKA 2022: ఇస్రోలో శిక్షణ పొందడానికి 9వ తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..అప్లై ఇలా..

ఇస్రోలో రాకెట్లను ఎలా లా తయారుచేస్తారు?, ఆకాశంలోకి ఎలా వెళతాయి? అక్కడి పనితీరు ఏమిటి? అనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. విద్యార్థుల్లో ఇది మరింత ఎక్కువ..

ISRO YUVIKA 2022: ఇస్రోలో శిక్షణ పొందడానికి 9వ తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..అప్లై ఇలా..
Isro Yuvika 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2022 | 1:39 PM

ISRO YUVIKA 2022 Notification Released: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తరచూ మనదేశంతో పాటు, ఇతర దేశాల ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ ప్రయోగాలను టీవీల్లో చూసినప్పుడు, పత్రికల్లో చదివినప్పుడు అసలు వీటిని ఎలా తయారుచేస్తారు?, ఆకాశంలోకి ఎలా వెళతాయి? అక్కడి పనితీరు ఏమిటి? అనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. విద్యార్థుల్లో ఇది మరింత ఎక్కువ. ఇది తెలుసుకోవడానికి వారికో అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకుంటే రాకెట్లను స్వయంగా చూసి, అంతరిక్ష అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందొచ్చు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు (ISRO Scientist)గా ఎదగడానికి ఇది దోహదపడనుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం…

గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం ఈ ఏడాది(2021-22) తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధులు యువికా-2022 శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులు, పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో గడిచిన మూడేళ్లలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు (సైన్స్‌ ఫెయిర్‌), ఒలింపియాడ్, సైన్సు పోటీల్లో బహుమతులు పొందిన ప్రతిభావంతులు, గుర్తింపు పొందిన అసోసియేషన్లు నిర్వహించిన క్రీడా పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారు, ఎన్‌సీసీ, ఎన్‌.ఎస్‌.ఎస్‌., సౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో సభ్యత్వం ఉన్నవారికి ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు మే 16 నుంచి 28వ తేదీ వరకు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది. ఎంపికైన అభ్యర్థ్ధితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ టీచర్‌కు కూడా ప్రయాణ భత్యం చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరిస్తారు.

ప్రాగ్రాం పేరు: యువికా-2022

  • అర్హులు: తొమ్మిదో తరగతి విద్యార్థులు
  • శిక్షణ: 13 రోజులు
  • రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్‌ 10, 2022
  • అర్హుల తొలి జాబితా విడుదల: ఏప్రిల్‌ 20

తొమ్మిదో తరగతి విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, స్పేస్‌ జ్ఞానం కల్పించేందుకు యువికా – 2022 (యంగ్‌ సైంటిస్ట్‌) కార్యక్రమాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించింది. స్టెమ్‌( సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్‌) ప్రాతిపదికన పరిశోధనలపై విద్యార్థులకు ప్రేరణ కలిగించడమే ధ్యేయంగా ఇస్రో క్యాచ్‌ దెమ్‌ యంగ్‌ ప్రణాళికతో దీనిని చేపట్టింది.

నమోదు ఇలా? జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అర్హులైన వారు www. isro.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ మెయిల్‌ ఐడితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత రెండు రోజుల్లో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. అది పూర్తయిన గంట తరవాత యువికా పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేయాలి. దీంతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలి.

రెండు వారాల శిక్షణ ఎంపికైన విద్యార్థులకు మే 16 నుంచి 28 వరకు శిక్షణ ఇస్తారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్, బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ సెంటర్‌లో వీటిని నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో ప్రముఖ శాస్త్రవేత్తల తమ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంటారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

Breaking! టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఎప్పుడు?.. ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు..