Anna University in Tamil Nadu: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ నిబంధనలు పాటించని సాంకేతిక విద్యా కళాశాలలు మూతపడనున్నాయి. అన్నా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 20 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఏడాది అనుకున్నంత స్థాయిలో విద్యార్థుల అడ్మిషన్లు లేకపోవడంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు మూసివేస్తన్నట్లు ప్రకటించాయి. అన్నా వర్శిటీ పరిధిలో దాదాపు 550కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిని కొనసాగించాలంటే ఏఐసీటీఈ వద్ద రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ బృందం తనిఖీలు చేశాక, అన్నీ వసతులు సక్రమంగా ఉన్నట్టయితే గుర్తింపును పొడిగిస్తూ వస్తోంది.
అయితే, ఏఐసీటీఈ నిబంధనలను ఏమాత్రం పాటించని 20 కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గత 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్లు పొందాలంటే ఈనెల 3వ తేదీలోపు ఏఐసీటీఈ వద్ద గుర్తింపు పొందాల్సి ఉంటుంది. కానీ, ఈ గడువు ముగిసేలోపు 450 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, వాటికే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వీటిలో 412 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. మరో తొమ్మిది కాలేజీలు 2021-22 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. అలాగే, మరో పదికి పైగా కాలేజీలు, ఇటు అన్నా విశ్వవిద్యాలయం, అటు ఏఐసీటీఈ వద్ద అడ్మిషన్లు చేసేందుకు ఎలాంటి అనుమతులు పొందులేదు. మొత్తంగా చూస్తే దాదాపు 20 కాలేజీల వరకు ఈ యేడాది విద్యార్థుల అడ్మిషన్లకు దూరంగా ఉన్నాయి.