ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మంజూరైన పోస్టుల్లో ప్రస్తుతం 50 శాతం కంటే తక్కువ మంది సిబ్బంది పని చేస్తుండటం మూలంగా వారిపై పని ఒత్తిడి పెరిగుతున్నట్లు హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో ప్రతివాదులకు నోటీసులు సకాలంలో పంపకపోవడం, కేసులను విచారణ జాబితాలోకి చేర్చకపోవడంపై పలువురు ఉద్యోగులపై హైకోర్టు గతంలో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం (డిసెంబరు 12) ఉద్యోగుల తరఫున న్యాయవాది టి శ్రీధర్ వాదనలు వినిపించారు. దీనిపై కోర్టు ఈ విధంగా స్పందించింది..
‘ఖాళీల సమస్యపై ఇప్పటికే హైకోర్టు ఉద్యోగుల సంఘం వ్యాజ్యం వేసినట్లు గుర్తుచేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేసింది. ఖాళీలను నిర్దిష్ట సమయంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. జ్యుడిషియల్ విభాగంలోని ఉద్యోగుల్లో 30 శాతం మందిని హైకోర్టులోని ఇతర విభాగాలకు బదిలీ చేయాలని, ఇలా చేయడం వల్ల గుత్తాధిపత్యాన్ని తొలగించవచ్చని’ తెల్పుతూ ఈమేరకు డిసెంబరు 12న ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రతిని హైకోర్టు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.