TG TET 2026 Application: తెలంగాణ టెట్‌కు ఊహించని స్పందన.. రేపటితో ముగుస్తున్న ఎడిట్‌ ఆప్షన్‌!

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్‌) 2025కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29వ తేదీ (శనివారం) అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి టెట్‌కు ఊహించని స్పందన వచ్చింది. దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు విద్యాశాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికే ఏకంగా..

TG TET 2026 Application: తెలంగాణ టెట్‌కు ఊహించని స్పందన.. రేపటితో ముగుస్తున్న ఎడిట్‌ ఆప్షన్‌!
Telangana Teacher Eligibility Test

Updated on: Dec 01, 2025 | 6:20 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 30: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్‌) 2025కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29వ తేదీ (శనివారం) అర్ధరాత్రితో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి టెట్‌కు ఊహించని స్పందన వచ్చింది. దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు విద్యాశాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికే ఏకంగా 2,26,956 దరఖాస్తులు అందటం గమనార్హం. గడువు ముగిసే సమయానికి మరో 20 వేల వరకు దరఖాస్తులు వచ్చి ఉంటాయి. ఈ ఏడాది గత జూన్‌లో నిర్వహించిన 2025 టెట్‌ తొలి విడత పరీక్షకు కేవలం 1.83 లక్షల దరఖాస్తు మాత్రమే రావడం విశేషం. ఇందులోనూ కేవలం 1.37 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు.

ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం టెట్‌ తప్పనిసరి కావడంతో ఏకంగా టీచర్లు కూడా భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏకంగా 70,851 మంది టీచర్లు ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లలో టెట్‌ పాస్‌ కాకుంటే ఉద్యోగంలో కొనసాగలేరని సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీన చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్‌లు దాఖలు చేస్తున్నాయి. అయితే ఉపాధ్యాయులు మాత్రం రివ్యూ పిటిషన్లపై ఆశలు పెట్టుకోకుండా టెట్ రాసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

మరో వైపు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని, ఆ చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన వారికి టెట్‌ మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతోపాటు గురుకులాలు, కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా తాజా టెట్‌కు దరఖాస్తు చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తుల్లో పొరపాట్లుంటే సరిచేసుకునేందుకు డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. సందేహాల కోసం పనివేళల్లో 7093708883, 7093708884 నంబర్లను సంప్రదించవచ్చు. కాగా డిసెంబర్ 27వ తేదీ నుంచి టెట్ – 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే లైఫ్‌ టైం వ్యాలిడిటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.