16 ఏళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డు.. ఈ కుర్రాడి చదువు చూస్తే నోరెళ్లబెడతారు!
భారత సంతతికి చెందిన లక్ష్మణన్ మెయ్యప్పన్ 16 ఏళ్లకే ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హత సాధించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫైనాన్స్‌పై అతనికున్న ఆసక్తి, తల్లి ప్రోత్సాహం అతని విజయంలో కీలకపాత్ర పోషించాయి. CFA, MSc కూడా అభ్యసిస్తూ, సెంచరీ ఫైనాన్షియల్‌లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న మెయ్యప్పన్ ప్రయాణం యువతకు కెరీర్ స్ఫూర్తిగా నిలుస్తోంది.

చాలా మంది యువత కెరీర్ గురించి ఆలోచించడం ప్రారంభించే వయసులోనే ఓ యువకుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. దుబాయ్‌కు చెందిన లక్ష్మణన్ మెయ్యప్పన్ కేవలం 16 సంవత్సరాల 141 రోజుల వయసులో ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హత సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
మెయ్యప్పన్‌కు ఫైనాన్స్‌పై ఆసక్తి కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొదలైంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తయిన తర్వాత, లాక్‌డౌన్ సమయంలో అతని తల్లి ప్రాథమిక అకౌంటింగ్ అంశాలను పరిచయం చేశారు. ఆమె కూడా ACCA అర్హత సాధించిన వ్యక్తి కావడంతో.. మెయ్యప్పన్‌కు ఆ రంగంపై మరింత ఆసక్తి పెరిగింది. 15 ఏళ్ల వయసులో ACCA చదవడం ప్రారంభించిన అతను సుమారు ఏడాది వ్యవధిలోనే ఆ అర్హతను పూర్తి చేశాడు.
అయితే అక్కడితో అతని విద్యాభ్యాసం ఆగలేదు. అనంతరం CFA చార్టర్‌ను కూడా సాధించాడు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో MSc చేస్తున్నాడు. చదువుతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగిస్తున్న మెయ్యప్పన్.. దుబాయ్‌లోని Century Financialలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక మార్కెట్లపై పరిశోధన, పెట్టుబడుల విశ్లేషణ, నిర్ణయాలకు సంబంధించిన అంశాల్లో ఆయన పనిచేస్తున్నారు.
అకౌంటింగ్, ఫైనాన్స్ మాత్రమే కాకుండా మెయ్యప్పన్‌కు ఇతర ఆసక్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఖాళీ సమయంలో గడియారాలను డిజైన్ చేయడం, తయారు చేయడం వంటి పనులు చేస్తుంటారు. తన గిన్నిస్ రికార్డు గురించి మెయ్యప్పన్ మాట్లాడుతూ.. అర్హతలను ఎప్పుడూ పోటీగా చూడలేదని చెప్పారు. వేగంగా చదువు పూర్తి చేయడం కంటే నిజ జీవితంలో ఫైనాన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.
మెయ్యప్పన్ ప్రయాణం.. సంప్రదాయ డిగ్రీ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, ఆసక్తి ఉన్న రంగంలో చిన్న వయసులోనే ప్రొఫెషనల్ అర్హతలు సాధించవచ్చని, అదే సమయంలో అనుభవాన్ని సంపాదించవచ్చని నిరూపిస్తోంది. ముఖ్యంగా అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో కెరీర్ కోరుకునే విద్యార్థులకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
