AP Police Constable Jobs: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సర్కార్ కొత్త కొర్రీలు.. ఏకంగా 1500 మందిపై వేటు!

కోటి ఆశలతో కొలువుల పోటీలో అన్ని దశలు దాటుకుంటూ ముందుకొచ్చిన కానిస్టేబుల్ అభ్యర్ధులకు సర్కార్ వయోపరిమితి పేరిట తీరని అన్యాయం చేస్తుంది. ఏకంగా 1500మందికి పైగా అభ్యర్ధులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా అడ్డుకుంటుంది. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అర్హులైన వారంతా హోంగార్డు అభ్యర్ధులు కేసు, అసెంబ్లీ ఎన్నికల కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు వయసు దాటిపోయిందంటూ అభ్యర్ధులను అనర్హులుగా బోర్డు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి..

AP Police Constable Jobs: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సర్కార్ కొత్త కొర్రీలు.. ఏకంగా 1500 మందిపై వేటు!
Police Constable Jobs

Updated on: Feb 16, 2025 | 9:10 AM

అమరావతి, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులకు మరో గండం ఎదురైంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణకు వచ్చేసరికి సర్కార్ రకరకాల కొర్రీలు పెడుతుంది. వయో నిబంధన అడ్డంకిగా చెబుతూ అర్హులను పక్కన పెట్టడం విడ్డూరంగా ఉంది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో కాకుండా రేంజ్‌ కో రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. అసలేం జరిగిందంటే..

2022లో అప్పటి జగన్‌ సర్కార్‌ 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో జనరల్, బీసీ అభ్యర్థులకు వయోనిబంధన కింద 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు ఉండాలని, ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి కూడా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వచ్చిన ఆయా దరఖాస్తులను ఆమోదించింది కూడా. అంటే నోటిఫికేషన్‌లోని ఆయా అర్హత నిబంధనలు సరిపోయినట్లే. అనంతరం 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. ఇందులో 91,507 మంది అర్హత సాధించారు. అనంతరం హోమ్‌ గార్డులు తమ సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో పోరుబాట పట్టారు. దాంతో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే సరికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. నాడు వాయిదా పడిన దేహదారుఢ్య పరీక్షలు కొత్త ఏడాది ప్రారంభంలో మొదలైనాయి.

నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎన్నో ఆశలతో వచ్చిన అభ్యర్థులకు కూటమి సర్కార్ వయో నిబంధన పేరిట అర్హులను పక్కనపెట్టింది. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన వారిలో దాదాపు 1500 మందికిపైగా అభ్యర్థులను వయసు కారణంగా అనర్హులుగా ప్రకటించింది. వీరందరికీ అంటే జనరల్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 32 ఏళ్ల పరిమితి దాటిపోయిందని వీరందరినీ అనుమతించ లేదు. దరఖాస్తు చేసే నాటికి తమకు వయసు కరెక్ట్‌గా ఉన్నా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వయసు దాటిపోయింది. దీంతో వీరంతా అనర్హులంటూ వారిని దేహదారుఢ్య పరీక్షలకు APSLPRB బోర్డు అనుమతించలేదు. అయితే కర్నూలు రేంజ్‌ పరిధిలో 1989 మేలో జన్మించిన ఓ అభ్యర్థిని దేహదారుఢ్య పరీక్షకు ఎలా అనుమతించారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొందరికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నెట్టింట తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.